క్రికెట్‌ చాలా ఎక్కువైపోయింది!! | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 27 2017 9:47 AM

MS Dhoni says So much cricket, backs Kohli - Sakshi

శ్రీనగర్‌: వరుస క్రికెట్‌ సిరీస్‌లు నిర్వహిస్తున్న బీసీసీఐ గజిబిజి షెడ్యూల్‌ను తప్పుబడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యలను మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సమర్థించారు. ఇటీవలికాలంలో క్రికెట్‌ ఆడటం బాగా ఎక్కువైపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా వంటి విదేశీ సిరీస్‌లు ఆడాలంటే ఆటగాళ్లకు తగినంత సమయం  కావాలని అన్నారు. రానున్న దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో ధోనీ ఆడకపోయినా... వన్డే సిరీస్‌లో ఆయన ఆడనున్నారు. అయితే, ఇలాంటి సవాల్‌ను ప్రతి అంతర్జాతీయ క్రికెటర్‌ ఎదుర్కోకతప్పదని అన్నారు.

‘కోహ్లి వ్యాఖ్యలకు నూటికి నూరుశాతం సరైనవే. మేం చాలా క్రికెట్‌ ఆడుతున్నాం. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాకు తగినంత సమయం శిక్షణ కోసం దొరకడం లేదు. కానీ, ఒక అంతర్జాతీయ క్రికెటర్‌గా ఈ సవాలును ఎదుర్కోవాల్సిందే’ అని ధోనీ అన్నారు. విదేశీ పర్యటనలకు కనీసం పదిరోజుల సమయం దొరికినా బావుండేదని, కానీ ప్రస్తుతం తక్కువ సమయం దొరికినా జట్టు బాగా ఆడగలదని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. జట్టులో విదేశాల్లో ఆడిన అనుభవం గల క్రికెటర్లు ఉన్నారని గుర్తుచేశారు. 

కశ్మీర్‌ బరాముల్లా జిల్లాలోని కంజెర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన చినార్‌ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ధోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనగర్‌లోని ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్‌  ఈ సిరీస్‌ను నిర్వహించింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహించాలా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. దయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే.. అది క్రీడ కన్నా ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటుందని, దీనిని పెద్ద విషయంగా పరిగణిస్తారని అన్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే అది దౌత్యపరంగా, రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి ప్రభుత్వానికే ఈ విషయాన్ని వదిలేయాలని అన్నారు.

Advertisement
Advertisement